Descrimination: ఇంగ్లండ్ క్రికెట్లో వివక్ష నిజమే... క్షమాపణ చెప్పిన ఈసీబీ
- ఇంగ్లండ్ క్రికెట్ లో వివక్షపై నివేదిక
- నివేదికలో విస్తుపోయే నిజాలు
- ప్రతి బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ చెప్పిన ఈసీబీ
- ఇలాంటి సంఘటనలు జరగకుండా కొత్త చట్టాలు తీసుకు వస్తామని వెల్లడి
ఇంగ్లండ్ క్రికెట్ లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతి బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్ తన నివేదికను ఈసీబీకి సమర్పించింది. ఈ నివేదికలో వివక్షకు సంబంధించి విస్తుపోయే విషయాలు ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం... ఇంగ్లండ్ క్రికెట్ లో వివక్ష జరిగింది నిజమే. బ్లాక్ లైవ్ మ్యాటర్స్, మీటూ తరహాలో నల్లవారికి అవమానాలు జరిగాయి. ఇందులోను 85 శాతం మంది భారతీయులే వివక్ష ఎదుర్కొన్నారు. దీనిని తీవ్రమైన చర్యగా భావిస్తున్నామనీ, నిర్మాణాత్మక, సంస్థాగత జాత్యహంకారం, లింగ వివక్ష - వర్గ ఆధారిత వివక్ష నుండి విముక్తి పొందలేకపోయారని నివేదిక పేర్కొంది.
ఈ నివేదికను పరిశీలించిన ఈసీబీ ఈ తప్పుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, తక్షణమే మార్పులు చేపడుతున్నామని ప్రకటించింది. క్రికెట్ అందరి ఆట అని, ఇక్కడ వివక్షకు తావులేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా త్వరలో కొత్త చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపింది.
ఈ నివేదిక పేర్కొన్నట్లుగా... నల్లజాతీయులకు, మహిళలకు జరిగిన అవమానాలను పట్టించుకోలేదని, అందుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపింది. నివేదికలో పేర్కొన్న 44 రికమెండేషన్స్ ను పరిశీలించామని, రానున్న మూడు నెలల్లో బలమైన ప్రణాళికను రూపొందించే ప్రయత్నం చేస్తామని పేర్కొంది.