Rajasthan: కోటాలో ఒకే రోజు ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య.. రెండు నెలల్లో తొమ్మిదో ఘటన
- ఉసురు తీసుకుంటున్న ‘నీట్’ విద్యార్థులు
- ఈ నెలలోనే నలుగురు విద్యార్థుల ఆత్మహత్య
- ఆందోళన కలిగిస్తున్న మరణాలు
రాజస్థాన్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నిన్న ఒకే రోజు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి నిన్న ఉదయం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని ‘నీట్’కు ప్రిపేరవుతున్న మెహుల్ వైష్ణవ్‌గా గుర్తించారు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. సలుంబార్‌కు చెందిన మెహుల్ రెండు నెలలుగా కోటాలో ఉంటూ ‘నీట్’కు శిక్షణ పొందుతున్నాడు.
మరో విద్యార్థి కూడా ఇలానే ప్రాణాలు తీసుకున్నాడు. దాదాపు రెండు నెలల క్రితం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ శిక్షణ కోసం కోటా వచ్చిన ఆదిత్య కూడా నిన్ననే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటాలో గత రెండు నెలల్లో మొత్తం 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వీరిలో ఐదుగురు ఒక్క మే నెలలోనే ప్రాణాలు తీసుకోగా, ఈ నెలలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.