Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతిని ముందుగా హిందువులకు వర్తింపజేయాలంటున్న డీఎంకే
- అన్ని కులాలను దేవాలయాల్లోకి అనుమతించాలని డిమాండ్
- యూసీసీ అవసరం లేదంటున్న తమిళనాడు అధికార పక్షం
- ప్రజల దృష్టిని మళ్లించేందుకే యూసీసీ ప్రస్తావన తెచ్చారని కాంగ్రెస్ ఆరోపణ
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేయాల్సిన అవసరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసావించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. బీజేపీతో ఢీ అంటే ఢీ అనే సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడులోని అధికారిక డీఎంకే దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. ముందుగా హిందువులకు యూసీసీ వర్తింపజేయాలని, ఆ తర్వాత అన్ని కులాల వారిని దేవాలయాల్లో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని ఆ పార్టీ వాదిస్తోంది. ‘హిందూ మతంలో ఉమ్మడి పౌరస్మృతిని మొదట ప్రవేశపెట్టాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలతో సహా ప్రతి వ్యక్తి దేశంలోని ఏ దేవాలయంలోనైనా పూజలు చేయడానికి అనుమతించాలి. రాజ్యాంగం ప్రతి మతానికి రక్షణ ఇచ్చింది కాబట్టి మాకు యూసీసీ వద్దు’ అని డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ విషయంలో మోదీ, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. దేశంలో ప్రధాన సమస్యలైన పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి ముందుగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘మణిపూర్ సమస్యపై ఆయన ఎప్పుడూ మాట్లాడరు. ఆ రాష్ట్రమంతా మండుతోంది. ఈ సమస్యలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు’ అని విమర్శించారు.