Virender Sehwag: వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్ కు ఎవరు వస్తారో చెప్పిన సెహ్వాగ్
- ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీ ఫైనల్స్ కు వెళతాయన్న అంచనా
- వారు అసాధారణ షాట్లు ఆడతారని చెప్పిన సెహ్వాగ్
- భారత్, పాకిస్థాన్ కూడా చేరుకుంటాయని ఊహాగానం
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ వెలువడడంతో ఇక క్రికెట్ సందడి మొదలైంది. ఎవరు 2023 ప్రపంచకప్ గెలుస్తారు? అన్న విషయమై భారీ అంచనాలే నెలకొన్నాయి. సామాన్యులే కాదు.. మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ తో ప్రపంచకప్ సంరంభం మొదలు కానుంది.
ఇంకా మూడు నెలల సమయమే మిగిలి ఉంది. దీంతో జట్లు సన్నాహాలు మొదలు పెట్టాల్సి ఉంది. టీమిండియా అయితే వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనలతో ఆగస్టు వరకు బిజీగా గడపనుంది. అప్పటి నుంచి సాధనకు నెల రోజులు మిగిలి ఉంటుంది. అయితే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలు ఏ జట్లకు ఎక్కువగా ఉన్నాయి? అన్న దానిపై ఎక్కువ మందిలో ఆసక్తి నెలకొంది. దీనిపైనే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను ఓ మీడియా సంస్థ ప్రశ్నించింది.
గ్రూపు దశ ముగిసి సెమీ ఫైనల్స్ కు ఏ జట్లు చేరుకోవచ్చని? ప్రశ్నించగా.. ‘‘నేను నాలుగు జట్లను ఎంపిక చేసేట్టు అయితే అవి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్. ఇవి సెమీ ఫైనలిస్టులు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అయితే కచ్చితంగా సెమీ ఫైనల్స్ కు వెళతాయి. ఎందుకంటే వారు ఆడే ఆటతీరు అంత గొప్పగా ఉంది. వారు సాధారణ షాట్లు కాదు, అసాధారణ షాట్లు ఆడతారు. ప్రపంచకప్ లో ఈ నాలుగు జట్లు చివరి దశకు చేరుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’’అని సెహ్వాగ్ తెలిపాడు. 2011 ప్రపంచకప్ స్క్వాడ్ లో సెహ్వాగ్ కూడా ఉండడం తెలిసిందే.