Team India: కోచ్ కిర్‌స్టన్‌కు పేరు తెచ్చింది తామేనంటూ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
- క్రికెటర్లతోనే కోచ్‌లకు పేరొస్తుందన్న సెహ్వాగ్
- కోచ్‌లు ఎంత కష్టపడ్డా మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లేనని వ్యాఖ్య
- 2011 వరల్డ్ కప్ తర్వాత గ్యారీ సాధించిందేమీ లేదని వ్యాఖ్య
టీమిండియా కోచ్‌లపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌ల పేరు ప్రతిష్ఠలకు క్రికెటర్లే కారణం అన్నాడు. కోచ్‌లు ఎంత కష్టపడ్డా.. చివరకు మైదానంలో బరిలోకి దిగి జట్టును గెలిపించేది ఆటగాళ్లేనని స్పష్టం చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గడం ద్వారా అప్పటి భారత జట్టుకు కోచ్ గా ఉన్న గ్యారీ కిర్ స్టన్ కెరీర్ను మార్చింది ఆటగాళ్లేనని చెప్పాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన సెహ్వాగ్ ఓ ఐసీసీ ఈవెంట్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘మైదానంలో ఉన్న ఆటగాడి ప్రదర్శనపైనే కోచ్ కీర్తి ప్రతిష్ఠలు ఆధారపడి ఉంటుంది. ఆటగాడు మంచి ప్రదర్శన చేస్తే కోచ్ కు పేరొస్తొంది. లేదంటే దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఈ మధ్య భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంది. అది గొప్ప విషయం. కానీ, దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఫైనల్లో ఓడిపోవడంపై అందరూ విమర్శలు గుప్పించారు. రాహుల్ ద్రవిడ్ మంచి కోచే. కానీ చివరకు ఆటగాడు మాత్రమే మైదానంలో పని చేయాల్సి ఉంటుంది. మేం 2011 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గ్యారీ కిర్ స్టన్ కు కోచ్ గా పేరు తెచ్చిపెట్టాం. అయితే, ఆ తర్వాత చాలా జట్లకు కోచ్‌గా పనిచేసిన గ్యారీ ఐపీఎల్ ట్రోఫీ (గుజరాత్ టైటాన్స్) తప్ప మరేమీ గెలవలేదు. అక్కడ కూడా కిర్ స్టన్ కంటే ఆశిష్ నెహ్రా చాలా ఎక్కువగా పని చేస్తున్నాడనేది నిజం. అది మీరు టీవీల్లో కూడా చూశారు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.