SCV Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే
- ఎస్.సి.వి.నాయుడికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు
- టీడీపీలోకి సాదర ఆహ్వానం
- ఎస్.సి.వి.నాయుడితో పాటు 500 మంది పార్టీలోకి వచ్చారన్న చంద్రబాబు
- శ్రీకాళహస్తిలో దారుణ పరిస్థితులు ఉన్నాయని వెల్లడి
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి.నాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేడు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఎస్.సి.వి.నాయుడికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎస్.సి.వి.నాయుడు ఆధ్వర్యంలో నేడు శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి దాదాపు 500 మంది టీడీపీలో చేరారని వెల్లడించారు. ఒకేసారి ఇంతమంది పార్టీలోకి రావడం శుభసూచకమని అన్నారు. వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీని చిత్తుగా ఓడించాలని, టీడీపీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలు, వ్యక్తులు శాశ్వతం కాదని, రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం అని వివరించారు. సమాజానికి చేటు చేసే వ్యక్తి కాబట్టే జగన్ ను ఓడించాలని చెబుతున్నామని చంద్రబాబు వెల్లడించారు.
తాను 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, ఇవాళ శ్రీకాహళహస్తిలో ఉన్నటువంటి పరిస్థితులు జీవితంలో ఎవరైనా చూశారా? అని ప్రశ్నించారు. ఒక శ్రీకాళహస్తి మాత్రమే కాదు... రాష్ట్రమంతా ఇదే వ్యవహారం నడుస్తోందని తెలిపారు.
"బటన్ నొక్కానని చెబుతాడు... అన్నీ ఉత్తుత్తి బటన్లే. చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా... కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూనే ఉంటాడు" అంటూ సీఎం జగన్ పైనా చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.