Rahul Gandhi: రాహుల్ గాంధీని ఎందుకు అడ్డుకున్నామంటే..!: మణిపూర్ పోలీసుల వివరణ
- రోడ్డు మార్గంలో రాహుల్ కాన్వాయ్‌పై గ్రనేడ్ దాడి జరగవచ్చుననే అనుమానం ఉందన్న పోలీసులు
- హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని సూచించామన్న పోలీస్ అధికారి
- రాహుల్ కాన్వాయ్ అడ్డుకోవడంపై కాంగ్రెస్ భగ్గు
చురాచాంద్‌పూర్ కు కారులో బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ చాపర్ ద్వారా చురాచాంద్పూర్కు చేరుకున్నారు. అయితే రాహుల్ ను అడ్డుకోవడానికి గల కారణాలను పోలీసు అధికారులు వెల్లడించారు. గ్రనేడ్ దాడి జరిగే ప్రమాదం ఉందనే అనుమానంతో తాము కాన్వాయ్ ని అనుమతించలేదని ప్రకటించారు.
'చురాచాంద్‌పూర్ జిల్లాకు రాహుల్ వెళ్లాలనుకునే మార్గంలో గ్రనేడ్ దాడి జరిగే ప్రమాదం ఉంది. అందుకే అడ్డుకున్నాం. హెలికాప్టర్ లో వెళ్లాలని సూచించాం. రాహుల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని తాము రహదారి మార్గంలో అనుమచించలేద'ని బిష్ణుపూర్ కు చెందిన పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఇంపాల్ చేరుకున్న రాహుల్ ఆ తర్వాత హెలికాప్టర్ లో వెళ్లి, సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడారు.
అయితే రాహుల్ ను పోలీసులు అడ్డుకోవడంపై మణిపూర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చారని, కానీ సీఎం ఆదేశాల మేరకు పోలీసులు రోడ్లను దిగ్బంధించారని తమకు తెలిసిందని, రాహుల్ పర్యటనను రాజకీయం చేస్తున్నారని మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ మేఘచంద్ర మండిపడ్డారు.