Mamata Banerjee: ఎన్నికలు పూర్తి కాగానే మమత మళ్లీ మాములుగా నడుస్తారు: కాంగ్రెస్ ఎంపీ వ్యంగ్యం
- ఎన్నికల ప్రచారంలో స్వల్పంగా గాయపడిన మమతా బెనర్జీ
- ప్రమాదం గాయాలను అడ్డుపెట్టుకొని సానుభూతి పొందే ప్రయత్నమన్న అధిర్ రంజన్
- ప్రజల దృష్టిని తనవైపుకు మళ్లించేందుకేనని ఆరోపణ
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జరిగిన గాయాలను అడ్డం పెట్టుకొని, ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నాలను ఆమె చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జులై 8న జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉత్తరాది జిల్లాల్లో రెండు రోజుల పాటు మమత పర్యటించారు. ప్రచారం ముగించుకొని కోల్ కతాకు తిరిగి వస్తున్న సమయంలో హెలికాప్టర్ ను ప్రతికూల వాతావరణం కారణంగా సెవోక్ ఎయిర్‌బేస్ లో అత్యవసరంగా దింపారు. ఆ సమయంలో మమతా బెనర్జీ విమానం దిగుతుండగా నడుము, కాళ్లకు గాయలయ్యాయి. దీంతో ఆమె తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.
ఈ అంశంపై అధిర్ రంజన్ విమర్శలు గుప్పిస్తూ.. ముఖ్యమంత్రి తనకు తగిలిన గాయాలను అడ్డం పెట్టుకొని ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మమతకు ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదని, గతంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆమె గాయపడ్డారని గుర్తు చేశారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆమె మళ్లీ మామూలు మనిషి అవుతారని, చక్కగా నడుస్తారని వ్యంగ్యంగా అన్నారు.