Rahul Gandhi: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి ఏం పని?: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నిలదీత
- రాహుల్ గాంధీ విదేశీ పర్యటనను ఉద్దేశించి అనురాగ్ విమర్శలు
- రాహుల్ విదేశీ కార్యక్రమాలు దేశ వ్యతిరేక అజెండా నడిపే భారత వ్యతిరేక శక్తులు నిర్వహిస్తున్నాయని ఆరోపణ
- దేశానికి వ్యతిరేకంగా ఉండేవారి మద్దతు, సహాయం రాహుల్ కు ఎందుకని ప్రశ్న
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనను ఉద్దేశించి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ విదేశాల్లో నిర్వహించే కార్యక్రమాలను దేశానికి వ్యతిరేకంగా అజెండా నడిపే భారత వ్యతిరేక శక్తులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లను పురస్కరించుకొని బీజేపీ చేపట్టిన సంపర్క్ సే సమర్థన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అనురాగ్ విలేకరులతో మాట్లాడారు.
రాహుల్ దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఎందుకు నెరపుతున్నారో చెప్పాలన్నారు. షహీన్ బాగ్ ఆందోళనలకు నిధులు సమకూర్చినవారే రాహుల్ విదేశీ పర్యటనలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. భారత్ పై నిత్యం విషం చిమ్మే సంస్థల సహకారంతో కార్యక్రమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. పాక్ కు అనుకూలంగా ఉండేవారు, దేశానికి వ్యతిరేకంగా నడుచుకునేవారి నుండి మద్దతు, సహాయం పొందాల్సిన అవసరం ఏమిటన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారి ఆహ్వానాలు స్వీకరించి, ఆయా వేదికలపై మన దేశానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని రాహుల్ ను, కాంగ్రెస్ ను ప్రశ్నించారు.