Tamil Nadu: కేంద్రం ఆదేశాలతో దిగొచ్చిన తమిళనాడు గవర్నర్.. మంత్రి బర్తరఫ్‌పై వెనక్కి
- మంత్రిని బర్తరఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన గవర్నర్
- ముందు న్యాయ సలహా తీసుకోవాలంటూ కేంద్రం సూచన
- మంత్రి బర్తరఫ్‌ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు
- సీఎం స్టాలిన్‌కు గవర్నర్ రవి లేఖ
అవినీతి ఆరోపణలతో జైలుపాలైన మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచనలతో తన ఆదేశాలను నిలుపుదల చేశారు. మంత్రిని బర్తరఫ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను హోల్డ్‌లో పెట్టినట్టు చెబుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. మంత్రి బర్తరఫ్ విషయంలో తొలుత అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న కేంద్రం సలహాతోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు తొలుత జారీ చేసిన ఆదేశాలు హోల్డ్‌లో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ నెల 14న మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ వస్తోంది. అప్పటి వరకు ఆయన చూసుకున్న విద్యుత్, ఎక్సైజ్ శాఖలను ఆర్థికమంత్రి తంగం తెన్నరసు, హౌసింగ్ మంత్రి ముత్తుస్వామికి ప్రభుత్వం అప్పగించింది. మంత్రిపై ‘క్యాష్ ఫర్ జాబ్స్’, ‘మనీలాండరింగ్’ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.