TS High Court: సరికొత్త చరిత్ర.. తొలిసారి తెలుగులో తీర్పును వెలువరించిన తెలంగాణ హైకోర్టు!
- అన్నదమ్ముల ఆస్తి వివాదానికి సంబంధించిన తీర్పును తెలుగులో వెలువరించిన హైకోర్టు
- అక్షర దోషాలు ఉంటే ఇంగ్లీష్ వర్షన్ తో సరిచూసుకోవాలన్న ధర్మాసనం
- తీర్పులో కొన్ని ఇంగ్లీష్ పదాలను వాడినట్టు వెల్లడి
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. చరిత్రలో తొలిసారి ఒక తీర్పును తెలుగులో వెలువరించింది. సికింద్రాబాద్ కు చెందిన అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదానికి సంబంధించిన తీర్పును మాతృభాషలో ఇచ్చింది. అచ్చమైన తెలుగులో 44 పేజీల తీర్పును వెలువరించింది. జస్టిస్ పి. నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం తమ తీర్పును ఇంగ్లీష్ లో రూపొందించి, దాన్ని తెలుగు వర్షన్ లో కూడా జత చేసింది.
తెలుగు వర్షన్ లో ఏవైనా అక్షర దోషాలు ఉంటే వాటిని ఇంగ్లీష్ వర్షన్ తో సరిచూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కక్షిదారుల సౌలభ్యం కోసమే తెలుగులో తీర్పును వెలువరించామని చెప్పింది. తెలుగు ప్రజలు కొన్ని ఇంగ్లీష్ పదాలను విరివిగా వాడుతున్న నేపథ్యంలో... తీర్పులో కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలను వాడినట్టు తెలిపింది. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఆన్ లైన్ లో ఉంచుతోంది. గత ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు కూడా మలయాళంలో ఒక తీర్పును వెలువరించింది.