Manipur: మణిపూర్‌లో ఆగని హింస.. సీఎం బీరేన్ సింగ్ సంచలన నిర్ణయం?
- సీఎం పదవికి రాజీనామా చేయనున్న బీరేన్ సింగ్?
- మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అనసూయ ఉకియ్‌తో భేటీ
- ఆమెకు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు సమాచారం
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. రెండు నెలలుగా హింస చల్లారడం లేదు. అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మణిపూర్ గవర్నర్ అనసూయ ఉకియ్‌తో బీరేన్ సింగ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బీరేన్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో భారీగా జనం సీఎం సెక్రటేరియట్, రాజ్‌భవన్ వద్దకు చేరుకుంటున్నారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నారు. రాజీనామా చేయడానికి బదులుగా.. హింసకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రిజర్వేషన్ల విషయంలో మైతేయ్, కుకీల మధ్య వైరం మొదలైంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీన జరిగిన గిరిజన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేతల ఇళ్లకు నిప్పంటించడం, మూకదాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.