KCR: పట్టాలు ఇస్తున్నాం... ఆ కేసులన్నీ రద్దు చేస్తాం: సీఎం కేసీఆర్ ప్రకటన
- గిరిజనులపై పెట్టిన పోడుభూముల కేసులన్నీ కొట్టేస్తామని వ్యాఖ్య
- తెలంగాణ వచ్చాక పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తెచ్చామన్న కేసీఆర్
- 4 వేల గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్న సీఎం
గిరిజనులపై పెట్టిన పోడుభూముల కేసులు అన్నీ కొట్టేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇకవారిపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వచ్చాక పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు.. మావా నాటె.. మావా రాజ్.. నా గూడెంలో నా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం అని వినిపించేదని, దశాబ్దాలపాటు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మూడు నుండి 4 వేల గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. కుమరంభీమ్ పేరిట కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఉద్యమం సమయంలో మీరంతా సహకరించి తనతో పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.
వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అంటూ ఒకప్పుడు పేపర్లో వార్తలు వచ్చేవని, అంటురోగాలతో ఆదిలాబాద్ అడవిబిడ్డలు సతమతమయ్యేవారని, ఇప్పుడు ఆ దుస్థితి లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్లు తెచ్చుకున్నామని, వైద్య వ్యవస్థను బాగుచేసుకున్నామని, అందుకే ఇవాళ మన్యం మంచం పట్టే సమస్య లేదన్నారు. తెలంగాణ వచ్చాక పేదల బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. ఒక్క కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నామన్నారు.
రేపటి నుండి మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47వేల ఎకరాల భూమిని అందిస్తారన్నారు. రానున్న మూడు రోజుల్లో పట్టాలు అందుతాయన్నారు. పట్టాలు అందడంతో పాటు అందరు రైతులకు వచ్చినట్టుగా పోడు పట్టాలు పొందినవారికి ఈ ఫసల్ నుండే రైతుబంధు వస్తుందన్నారు. పోడుభూములకు సంబంధించి గిరిజన బిడ్డల మీద గతంలోని కేసులు అలాగే పెట్టి, మరోవైపు పట్టాలు ఇస్తే కుదరదని, అందుకే ఆ కేసులను ఎత్తివేస్తామని, వారిపై ఇక కేసులు ఉండవన్నారు.