Siddaramaiah: యాసిడ్ దాడి బాధితురాలికి తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చిన కర్ణాటక సీఎం
- మంచి మనసు చాటుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
- ప్రజావాణికి వచ్చి అభ్యర్థించిన యువతికి అభయ హస్తం
- కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంచి మనసు చాటుకున్నారు. ఓ యాసిడ్ దాడి బాధితురాలికి సచివాలయంలో ఉద్యోగం కల్పించాలని సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.
సీఎం నివాసంలో జరిగిన ప్రజావాణికి వచ్చిన బాధితురాలు తన కష్టాల గురించి సిద్ధరామయ్యకు చెప్పారు. ఆ విషయాలను విన్న సీఎం సిద్ధరామయ్య అక్కడికక్కడే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
బాధితురాలు గతేడాది 28న దాడికి గురైందని, ఆమె ఎంకామ్ గ్రాడ్యుయేట్ అని సీఎంవో తెలిపింది. ఆమె తల్లిదండ్రులు కూడా జనతా దర్శన్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొంది.
ఉపాధి కోసం అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కూడా విన్నవిస్తే, ఆయన హామీ ఇచ్చినప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని బాధితురాలు సీఎం దృష్టికి తెచ్చారు. బాధితురాలి విజ్ఞప్తిని విన్న ముఖ్యమంత్రి ఆమెకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన సచివాలయంలో ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
కాగా, సదరు యువతిపై దాడి చేసి తిరువణ్ణామలై ఆశ్రమంలో స్వామి వేషధారణలో తలదాచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ప్రస్తుతం నిందితుడు బెంగళూరు జైలులో ఉన్నాడు. బాధితురాలు చికిత్స పొందుతోంది. దీనికి ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం అందుతోంది’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.