West Indies: వెస్టిండీస్ కు షాక్... క్రికెట్ చరిత్రలో మొదటిసారి వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన కరీబియన్లు
- అర్హత టోర్నీలో స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన విండీస్
- గతంలో రెండుసార్లు వరల్డ్ కప్ నెగ్గిన కరీబియన్లు
- ఈసారి నేరుగా అర్హత సాధించలేకపోయిన వైనం
- క్వాలిఫయింగ్ టోర్నీలో పసికూన జట్ల చేతిలో ఓటమి
ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టుకు అత్యంత ఘోర పరాభవం ఎదురైంది. మొదటిసారి వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయింది.
జింబాబ్వేలో జరుగుతున్న వరల్డ్ కప్ అర్హత టోర్నీలో సూపర్ సిక్స్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. హరారేలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన విండీస్ బ్యాటింగ్ లైనప్ ను స్కాట్లాండ్ బౌలర్లు హడలెత్తించారు. అనంతరం, 182 పరుగుల లక్ష్యాన్ని స్కాట్లాండ్ జట్టు 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ప్రపంచ క్రికెట్లో వన్డే వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టాక, ఇప్పటివరకు జరిగిన ప్రతి టోర్నీలోనూ వెస్టిండీస్ ఆడింది. 1975, 1979లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో విజేతగా నిలిచింది. 90వ దశకం తర్వాత విండీస్ క్రికెట్ ప్రాభవం మసకబారుతూ వస్తోంది.
ఆ తర్వాత టీ20 క్రికెట్లో ప్రపంచ చాంపియన్ గా నిలిచినప్పటికీ, నిలకడ లేకపోవడంతో మరింత పతనమైంది. కనీసం వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించలేక, చిన్నాచితకా జట్లతో క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడాల్సిన దుస్థితికి పడిపోయింది. ఇప్పుడు ఆ చిన్న జట్లపైనా గెలవలేక అత్యంత అప్రదిష్ఠ మూటగట్టుకుంది. రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టు టోర్నీకి క్వాలిఫై కాలేకపోవడం ఇదే ప్రథమం.