Ponguleti: కాంగ్రెస్ జనగర్జనకు రానివ్వకుండా వేధిస్తున్నారు.. ప్రెస్ మీట్ లో పొంగులేటి కంటతడి
- సత్యాగ్రహ మార్గంలో వేధింపులను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపు
- చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంవీఐలను పిలిపించిందని ప్రభుత్వంపై ఆరోపణ
- వాహనాల తనిఖీ పేరుతో జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపాటు
- సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటూ కార్యకర్తలకు పొంగులేటి పిలుపు
కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం (నేడు) సాయంత్రం ఖమ్మంలో జరగనున్న సభకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలను అధికారులు అడ్డుకుంటున్నారని కంటతడి పెట్టారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు శనివారం అర్ధరాత్రి నుంచే వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ట్రాక్టర్లు, బైక్ లు, ఆటోలు, కార్లు, డీసీఎం వ్యానులు.. ఇలా దాదాపు 1700 ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసుకున్నారని వివరించారు. అయితే, ప్రభుత్వం మాత్రం జనాలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని పొంగులేటి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ (ఎంవీఐ) లను పిలిపించి అర్ధరాత్రి నుంచే వాహనాల తనిఖీ నిర్వహిస్తోందని చెప్పారు.
వాహనాలను ఆపుతూ, ఆర్ సీ, సీ బుక్ తదితర పేపర్లను వారు లాగేసుకుంటున్నారని విమర్శించారు. తద్వారా ప్రజలను భయాందోళనలకు గురిచేసి, సభకు హాజరుకాకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని చెప్పారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన కార్యకర్తలు, తనను అభిమానించే వారు ఎవరూ భయపడవద్దని, సత్యాగ్రహ మార్గంలో వేధింపులను అడ్డుకోవాలని, ఇందుకు ఎంతదూరమైనా వెళ్లాలని సూచించారు.
ఏ వాహనం దొరికితే అది పట్టుకుని, వాహనాలు దొరకకుంటే ఎడ్ల బండిపైన లేదంటే దేవుడు ఇచ్చిన కాళ్లతో నడుచుకుంటూ సభకు వస్తారని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియాగాంధీ గారికి రుణపడి ఉన్నామని, ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం ఇదేనని చెప్పారు. సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ సభను దిగ్విజయం చేయాలని కార్యకర్తలకు పొంగులేటి పిలుపునిచ్చారు.