Biren Singh: మణిపూర్ అల్లర్లపై సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- మణిపూర్‌తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా, మయన్మార్
- జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగమేనని అనిపిస్తోందన్న సీఎం
- అన్ని తెగలు కలిసి జీవించాలని పిలుపు
జాతుల మధ్య కొనసాగుతున్న వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించినప్పటికీ ఎక్కడో ఓ చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి ఎన్. బీరేన్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హింస వెనక విదేశీ శక్తుల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఏఎన్ఐ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ అల్లర్లు జరుగుతుండొచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రం మయన్మార్, చైనాతో సరిహద్దులు పంచుకుంటోందని, దాదాపు 398 కిలోమీటర్ల సరిహద్దులో కాపలా లేదని బీరేన్ సింగ్ పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అల్లర్లు ‘ప్రీ ప్లాన్డ్’ అన్న అనుమానాన్ని కొట్టిపడేయలేమన్నారు. అయితే, ఎందుకు? అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మణిపూర్‌ను జాతి ప్రాతిపదికన చీల్చేందుకు తాను అనుమతించబోనని, అన్ని తెగలు కలిసిమెలసి జీవించాలని పిలుపునిచ్చారు.