Telangana: కాంగ్రెస్ ‘జనగర్జన’లో ప్రసంగించేది ఆ ఆరుగురే..!
- మిగతావారికి అవకాశంలేదని పార్టీ వర్గాల వెల్లడి
- రాహుల్ గాంధీతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ కు అవకాశం
- భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, రేణుకా చౌదరిలకు కూడా..
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనగర్జన సభకు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రానికి చెందిన ఆరుగురు నేతలు మాత్రమే మాట్లాడతారట. మిగతా నేతలు ప్రసంగించేందుకు పార్టీ అవకాశం కల్పించలేదని సమాచారం. తొలుత రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరిలతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే ప్రసంగిస్తారని తెలుస్తోంది.
పొంగులేటి, జూపల్లి చేరికతో పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కీలక సభలో కేవలం ఆరుగురు నేతలకు మాత్రమే ప్రసంగించే అవకాశం కల్పించింది. ఈ సభలో రాహుల్ గాంధీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రవేశపెడతారని.. పలు హామీలు సైతం ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భారీ ఏర్పాట్లు..
జనగర్జన సభ కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ వెనక భారీ ఏర్పాట్లు చేశారు. 55 అడుగుల ఎత్తు, 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏకంగా 200 మంది కూర్చునేందుకు వీలుగా సభావేదికను ఇప్పటికే ఏర్పాటు చేశారు. సభకు వచ్చే జనాలను దృష్టిలో పెట్టుకుని 40 అడుగుల ఎత్తులో డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు.