Mexican Mayor: ఆడ మొసలిని పెళ్లాడిన మెక్సికో టౌన్ మేయర్
- బంధుమిత్రులతో కలిసి ఆడిపాడుతూ వేడుక
- సంప్రదాయ వేడుకలో భాగంగానేనని వివరణ
- టౌన్ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ కార్యక్రమం
మెక్సికోలోని ఓ సిటీ మేయర్ మొసలిని పెళ్లాడారు.. బంధువులు, మిత్రుల సమక్షంలో వివాహతంతును భక్తిశ్రద్ధలతో పూర్తిచేశారు. ఆ తంతు పూర్తయ్యాక తన కొత్త భార్యతో కలిసి వేదికపై డ్యాన్స్ చేశాడు. అయితే, ఇదంతా తమ సంప్రదాయంలో ఓ భాగమని, సిటీలో నివసిస్తున్న ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వివాహ తంతును జరిపించినట్లు వెల్లడించారు. తమ పూర్వీకుల కాలంలో ఈ వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని, దాదాపు 230 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ వివాహం జరిగిందని చెప్పారు.
శాన్ పెడ్రో హ్యువామెలులా టౌన్ మేయర్ విక్టర్ హ్యూగో సోసా ఛోంతాల్ తెగకు చెందిన వారు. ఈ తెగలో పాలకులు ఆడ మొసలిని పెళ్లాడడం సంప్రదాయంగా కొనసాగేది. తమ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, వారికి అదృష్టం కలగాలని కోరుకుంటూ ఛోంతాల్ తెగ రాజులు ఈ తంతు నిర్వహించేవారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆకుపచ్చ డ్రెస్ ను ఆడ మొసలికి తొడిగి, అందంగా ముస్తాబు చేసి ఇంటింటికీ తీసుకువెళతారు.
జనమంతా మొసలిని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తారు. ఈ తంతు జరిగేటప్పుడు మొసలి నోటిని కట్టేసి ఉంచుతారు. అనంతరం మొసలిని తెల్లని దుస్తులతో అలంకరించి వివాహ వేదికకు తరలిస్తారు. సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేసి రాజు (పాలకుడు) మొసలిని పెళ్లి చేసుకుంటారు. పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈ వివాహ తంతును నిర్వహించినట్లు విక్టర్ వెల్లడించారు.