Renuka Chowdhury: ఎవడ్రా మమ్మల్ని ఆపేది?: రేణుకా చౌదరి ఫైర్
- పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారన్న రేణుకా చౌదరి
- బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా అని ప్రశ్న
- మీటింగ్‌కు వెళ్లొద్దని ప్రజలకు డబ్బులిచ్చి అడుక్కుంటున్నారంటూ ఎద్దేవా
ఖమ్మం జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోడ్డుపై అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి.. ‘‘మా ప్రజలు, మేము వెళ్తున్నాం.. నువ్వు ఎవడ్రా ఆపడానికి? బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా? పిచ్చి భ్రమలు. ఎవడ్రా మమ్మల్ని ఆపేది” అంటూ శివాలెత్తారు.
పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
‘‘మేం పర్మిషన్లు అడిగాం.. నువ్వు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు.. కానీ మా మూడ్ ఇప్పుడు మారదు. నువ్వు బస్సులు ఇవ్వకపోతే పో.. వియ్ డోంట్ కేర్. కాళ్లతో నడిచి వస్తారు ప్రజలు. డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్‌కు వెళ్లొద్దని చెబుతున్నారట అడుక్కుతినే వెధవలు” అంటూ మండిపడ్డారు.