Rahul Gandhi: మేం వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ప్రకటన
- ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ జనగర్జన సభ
- తెలంగాణ స్వప్నాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందన్న రాహుల్
- బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అని వ్యాఖ్యలు
- కర్ణాటకలో బీజేపీని ఓడించినట్టు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడిస్తామని ధీమా
- తెలంగాణలో బీజేపీ చతికిలపడిందని ఎద్దేవా
ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని అభివర్ణించారు. మీ మనసుల్లో, మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని అన్నారు. పీపుల్ మార్చ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్టు తెలిపారు. భట్టి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని కొనియాడారు.
ఈ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నందుకు పొంగులేటికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని అభినందించారు.
ఒకప్పుడు తెలంగాణ అనేది పేదలకు, రైతులకు, అందరికీ ఓ స్వప్నంలా ఉండేదని... కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిన ఆ స్వప్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాటు ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు తానో రాజులా భావిస్తుంటారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తన జాగీరు అనుకుంటున్నారని విమర్శించారు.
"ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారు. ఈ భూములు కేసీఆర్ వి కావు... మీవి. టీఆర్ఎస్ ఏకంగా తన పేరే మార్చుకుంది. పార్లమెంటులో బీజేపీకి బీ టీమ్ లా పనిచేసింది. రైతుల బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే, ఆ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ముఖ్యమంత్రి దాన్ని సమర్థిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉంది. కేసీఆర్ స్కాములన్నీ మోదీకి తెలుసు.
ధరణి భూముల సమస్యను భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలుసుకున్నా. మిషన్ భగీరథలో కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. అన్ని విధాలుగా ప్రజలను దోచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఐదు అంశాలతో వరంగల్ డిక్లరేషన్ చేసింది. దాని తర్వాత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ చేసింది. ఈ ఖమ్మం సభ ద్వారా ఓ చారిత్రాత్మక నిర్ణయం ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. ఈ నిర్ణయం పేదల జీవితాల్లో మార్పు తెస్తుందని భావిస్తున్నాం. ఆదివాసీలకు పోడు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తాం.
ఇటీవలే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. అక్కడ నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం ఉండేది. ఆ అవినీతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలిచింది.
గతంలో, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ అనేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. బీజేపీ ఎప్పుడో ఖతమ్ అయిపోయింది. ఏమైందో తెలియదు కానీ, బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయి. పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే. కర్ణాటకలో ఎలాగైతే బీజేపీని ఓడించామో, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి బీ టీమ్ గా ఉన్న బీఆర్ఎస్ ను కూడా అలాగే ఓడించబోతున్నాం.
ఇటీవల ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బీఆర్ఎస్ వస్తే మేం సమావేశానికి హాజరు కాబోమని స్పష్టంగా చెప్పాం. నేతల కోసం కాంగ్రెస్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మా ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చినవారు ఎవరైనా రావొచ్చు" అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.