Priyanka Gandhi: ఏపీ రాజధాని అమరావతికి త్వరలోనే ప్రియాంకగాంధీ
- రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమన్న రాహుల్‌గాంధీ
- అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
- ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నీ తనకు తెలుసన్న అగ్రనేత
- వచ్చే నెలలో విశాఖకు రాహుల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో త్వరలోనే ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని వెల్లడించారు. నిన్న ఖమ్మంలో జరిగిన తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్న ఆయన అనంతరం రోడ్డు మార్గంలో రాత్రి 10.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, మేడ సురేశ్ తదితరులతో రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.
అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమని అన్నారు. అమరావతికే కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రియాంకగాంధీ త్వరలోనే పర్యటిస్తారని చెప్పారు. ఏపీలో జరుగుతున్న పరిణామలన్నీ తనకు తెలుసని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ చెప్పినట్టు పీసీసీ చీఫ్ రుద్రరాజు మీడియాకు తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు తెలిపేందుకు వచ్చే నెలలో విశాఖపట్టణంలో నిర్వహించనున్న సభలో రాహుల్ పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ గురించి కూడా రాహుల్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.