Sonia Gandhi: శరద్ పవార్ కు సోనియా గాంధీ ఫోన్ కాల్
- మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్
- అంతకుముందు ఎన్సీపీ చీఫ్ తో మాట్లాడిన ఖర్గే, రాహుల్
- పార్టీలో తిరుగుబాటు వివరాలను ఆరా తీసిన నేతలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ తోనే ఉంటుందని సోనియా స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ వివరించారు. కాగా, పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటుపై శరద్ పవార్ స్పందిస్తూ.. ఇలాంటి తిరుగుబాట్లు తనకు కొత్త కాదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. తనను వదిలి వెళ్లిన కొంతమంది నేతల భవిష్యత్తును తలచుకుంటే బాధ కలుగుతోందని అన్నారు.
జరిగిన దానికి ఎలాంటి విచారం లేదని చెప్పిన శరద్ పవార్.. పార్టీ బలోపేతానికి పనిచేస్తానని వివరించారు. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) నేతలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ఓట్లేసి తమను గెలిపించిన సామాన్య ప్రజలే తమ బలమని శరద్ పవార్ పేర్కొన్నారు.