MS Dhoni: యాషెస్‌లో రనౌట్ వివాదం.. నాడు ధోనీ చేసింది ఇదే!
- యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో రనౌట్‌పై వివాదం
- 2011లో ధోనీ చేసిన పనిని గుర్తు చేస్తున్న నెటిజన్లు
- ‘క్రీడా స్ఫూర్తి అంటే ఇదీ’ అంటూ కామెంట్లు
యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో రనౌట్ పెద్ద దుమారమే రేపుతోంది. తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ వివాదాస్పదమైంది. దీంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని, గెలుపు కోసం ఏదైనా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ‘క్రీడా స్ఫూర్తి అంటే ఇదీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
యాషెస్ రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న జానీ బెయిర్‌స్టో.. ఓవర్ చివరి బంతిని ఆడకుండా వదిలేశాడు. ఓవర్ అయిపోయిందని వెంటనే ముందుకు కదిలాడు. ఇదే సమయంలో ఆసీస్ కీపర్.. దూరం నుంచే బంతిని విసిరి రనౌట్ చేశాడు. ఆసీస్ ప్లేయర్లు అప్పీల్ చేయడం, అంపైర్ ఔట్ ఇవ్వడం వెనువెంటనే జరిగిపోయాయి. అసలేం జరిగిందో అర్థం కాక జానీ బెయిర్‌స్టో అలానే ఉండిపోయాడు. చేసేదేం లేక చివరికి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
ఈ ఘటనను 2011 నాటి టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్‌తో పోలుస్తున్నారు నెటిజన్లు. నాడు ధోనీ వ్యవహరించిన తీరును అభినందిస్తున్నారు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇయాన్ బెల్ కొట్టిన బంతిని బౌంటరీ లైన్ వద్ద ప్రవీణ్ కుమార్ అడ్డుకున్నాడు. అయితే అది ఫోర్ పోయిందని భావించి, నెమ్మదిగా బంతిని విసిరాడు. బెల్ కూడా ఫోర్ పోయిందనే అనుకుని.. క్రీజులోకి వెళ్లకుండా నిలిచిపోయాడు.
ఇద్దరు బ్యాటర్లు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపుకు వెళ్లడంతో భారత ఆటగాడు ప్రవీణ్ నుంచి బంతిని అందుకుని రనౌట్ చేశాడు. దీంతో ఏం జరిగిందో బెల్ కు అర్థం కాలేదు. రిప్లైలో బంతి బౌండరీలైన్‌ను తాకలేదని తెలియడంతో అంపైర్ బెల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. తర్వాత టీ బ్రేక్ ఇస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
అనూహ్యంగా టీ బ్రేక్ తర్వాత బెల్.. మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. బెల్ ఔట్ అప్పీల్‌ను అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెనక్కి తీసుకున్నట్లు అంపైర్లు తెలిపారు. దీంతో బెల్ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. నాడు ధోనీ స్ఫూర్తిని మాజీలు, విశ్లేషకులు, ఫ్యాన్స్ వేనోళ్ల పొగిడారు. ఆసీస్ తొండాట నేపథ్యంలో నాటి వీడియో వైరల్‌గా మారింది.