Nara Lokesh: ఆ పని నేను చేసినా.. వీడు ఇంట్లోనే ఉన్నాడు పట్టుకెళ్లండని పోలీసులకు మా నాన్న ఫోన్ చేసి చెపుతారు: నారా లోకేశ్
- పాదయాత్రలో భాగంగా మహిళలతో ముచ్చటించిన నారా లోకేశ్
- టీడీపీ అధికారంలోకి వస్తే గంజాయి బ్యాచ్ లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న మహిళా న్యాయవాది
- టీడీపీ లీడింగ్ అనే బ్రేకింగ్ వస్తే చాలు లా అండ్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోతుందన్న లోకేశ్
- చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లకు చంద్రబాబు అంటే టెర్రర్ అని వ్యాఖ్య
- తాను చట్టాన్ని ఉల్లంఘించినా ఊరుకోరన్న లోకేశ్
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఈరోజు మహిళలతో లోకేశ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా న్యాయవాదిగా పని చేస్తున్న ఓ మహిళ మాట్లాడుతూ... జడ్జిగా ఉన్న ఒక మహిళ ట్రైన్ దిగి వస్తుండగా గంజాయి మత్తులో ఉన్న కొందరు ఈవ్ టీజింగ్ చేశారని, వేధించారని తెలిపారు. ఆ ఘటనపై వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇదే నెల్లూరులో మహిళా మేయర్ చీరను లాగినంత పని చేశారని, దానిపై కూడా చర్యలు లేవని విమర్శించారు. రంగనాయకమ్మ అనే 70 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే సీఐడీ పోలీసులు కేసు పెట్టి వేధించారని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.
ఆమె ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ... మనందరం 'బైబై గంజాయి బ్రో జగన్' అని చెప్పాలన్నారు. వాళ్ల సొంత ఎమ్మెల్సీ అనంతబాబు అరకు, పాడేరు ప్రాంతంలో గంజాయిని పెద్ద ఎత్తున పండిస్తున్నాడని ఆరోపించారు. అన్ని గ్రామాలకు గంజాయిని సరఫరా చేస్తున్నాడని చెప్పారు. ఒకప్పుడు నగరాలు, పెద్ద పట్టణాల్లో దొరికే గంజాయి ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా దొరుకుతోందని అన్నారు.
తాను చంద్రగిరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక మహిళ తన వద్దకు వచ్చి మాట్లాడిందని... ఆమె కూతురుని వైసీపీ నాయకులు గంజాయికి బానిసను చేశారని, ఆమెను వాడుకున్నారని చెప్పిందని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే గంజాయిని పండించి, సరఫరా చేస్తే సమాజం ఏమి కావాలని ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో గంజాయి మత్తులో ఒక మహిళపై గ్యాంగ్ రేప్ చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నాయకుడు కఠినంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరగవని చెప్పారు. సమాజంలో భయం అన్నా ఉండాలి లేదా భక్తి అన్నా ఉండాలని... ఇప్పుడు ఆ రెండు లేవని అన్నారు. వైసీపీ నేతలే మహిళలను కించపరుస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల కౌంటింగ్ రోజున ఒక్కసారి తెలుగుదేశం పార్టీ లీడింగ్ అనే బ్రేకింగ్ వస్తే చాలు లా అండ్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోతుందని లోకేశ్ చెప్పారు. 2024 మే నెలలో లీడింగ్ అనే బ్రేకింగ్ వస్తుందని, వెంటనే అంతా సెట్ అయిపోతుందని అన్నారు. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లకు చంద్రబాబు అంటే టెర్రర్ అని చెప్పారు. తాను చట్టాన్ని ఉల్లంఘించినా ఆయన ఊరుకోరని... పోలీసులకు ఫోన్ చేసి వీడు ఇంట్లోనే ఉన్నాడు, పట్టుకెళ్లండని చెపుతారని తెలిపారు. ఒక 10 నెలలు ఓపిక పట్టాలని, ఆ బ్రేకింగ్ న్యూస్ వస్తుందని, ఆటోమేటిక్ గా శాంతిభద్రతలు కంట్రోల్ లోకి వస్తాయని చెప్పారు.