Akhilesh Yadav: విపక్ష నేతలను కలిసిన అఖిలేశ్ ఈరోజు కేసీఆర్ను కలిశారు: కిషన్ రెడ్డి
- అఖిలేశ్, కేసీఆర్ భేటీతో ఎవరికి ఎవరు బీ టీమో తెలుస్తుందని వ్యాఖ్య
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శ
- ఈ రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయన్న కేంద్రమంత్రి
ఈరోజు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారని, ఇటీవల పాట్నాలోను విపక్ష నేతలతో అఖిలేశ్ భేటీ అయ్యారని, వీరిద్దరి సమావేశాన్ని చూస్తే ఎవరికి ఎవరు బీ టీమో తెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ రెండు పార్టీల డీఎన్ఏ కూడా ఒక్కటేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. కానీ తమ పార్టీ మాత్రం ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు.
మరోపక్క, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి పారిపోయిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి రాహుల్ కు బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. తమ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండు సమదూరంలోనే ఉన్నాయన్నారు. తాము బీఆర్ఎస్ తో గతంలో కలవలేదని, భవిష్యత్తులోను కలిసే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలన, అవినితిపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.