Tamilisai Soundararajan: ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించిన తమిళసై, ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆసుపత్రి విషయంలో చొరవచూపిన కోర్టును అభినందిస్తున్నట్లు చెప్పిన గవర్నర్
- ఉస్మానియాలో టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని ఆవేదన
- ఎవరినీ తప్పుబట్టేందుకు రాలేదని గవర్నర్ వ్యాఖ్య
- ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని సూచన
తెలంగాణ గవర్నర్ తమిళసై సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... ఉస్మానియా ఆసుపత్రి విషయంలో చొరవచూపిన కోర్టును అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి టాయిలెట్లు దారుణంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయన్నారు. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పని చేస్తున్నాయని, ఎండవేడిని తట్టుకోలేక రోగులు పారిపోతున్నారన్నారు. రోజుకు రెండువేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని, 200 వరకు సర్జరీలు చేస్తున్నారన్నారు.
ఆసుపత్రి భవనం కట్టి వంద ఏళ్లవుతోందని, కొత్త భవనం కట్టవలసిన అవసరం ఉందన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఇక్కడకు రాలేదని చెప్పారు. కాగా, గవర్నర్ కు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, పాత భవనాన్ని ఆమె పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతూ గవర్నర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి నూతన భవనానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జస్టిస్ ఫర్ ఓజీహెచ్ అంటూ చేసిన ట్వీట్ ను గవర్నర్ రీట్వీట్ చేశారు. ఉస్మానియా దుస్థితి బాధాకరమని, కొత్త భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలన్నారు. ఆమె వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఆసక్తిని రేపింది.