america: తరగతి గదిలోనే అమ్మాయిలను చొక్కాలు విప్పమన్న ప్రొఫెసర్ తొలగింపు
- అమెరికాలోని మేరీలాండ్ కాలేజీలో ఘటన
- ఇద్దరు అమ్మాయిల ఫిర్యాదు.. ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్ దర్యాప్తు
- ల్యాబ్ కోట్ ధరించినా వాటిని విప్పాలని చెప్పేవాడని వెల్లడించిన నివేదిక
అమెరికాలోని ఓ కాలేజీ ప్రొఫెసర్... మహిళా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను యాజమాన్యం ఆయనను తొలగించింది. మేరీలాండ్ లోని ఓ కాలేజీ ప్రొఫెసర్.. విద్యార్థినులపై తరగతి గదిలోనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు అమ్మాయిలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్ విభాగంతో దర్యాప్తు జరిపించి, ఆ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించారు.
ఈ నివేదిక ప్రకారం తరగతి గదిలోనే విద్యార్థినులు చొక్కాలు విప్పి నిలబడాలని ప్రొఫెసర్ ఆదేశించాడు. తద్వారా వారి శరీర భాగాలను పరిశీలిస్తానని చెప్పేవాడు. బోధనలో భాగంగా ఆయా భాగాల గురించి వివరించడానికి దుస్తులు విప్పవలసిన అవసరం లేనప్పటికీ వారి షర్ట్‌లను తొలగించాలని ప్రొఫెసర్ ఒత్తిడి తెచ్చేవాడని, ల్యాబ్ కోట్ ధరించినా వాటిని విప్పాలని చెప్పేవాడని నివేదిక వెల్లడించింది.
2019లో ప్రారంభమైన అతని దారుణాలు చాలారోజులపాటు కొనసాగడంతో పాటు పదుల సంఖ్యలో విద్యార్థినులతో ప్రొఫెసర్ వికృతంగా ప్రవర్తించినట్లు వెల్లడైంది. అమ్మాయిలు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం ప్రొఫెసర్ ను సెలవుల్లో పంపింది. ఆ తర్వాత మూడు నెలల పాటు విచారణ సాగింది. విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడి కావడంతో ప్రొఫెసర్ ను తొలగిస్తూ చర్యలు తీసుకుంది. తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ప్రొఫెసర్ కారణంగా వేధింపులకు గురైన అమ్మాయిలు పరీక్షలో ఫెయిల్ అయితే కోర్సు ఫీజు తిరిగి చెల్లిస్తామని, వాళ్లు మళ్లీ కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది.