Reliance: రూ.999కే 4G జియో భారత్ ఫోన్‌ను తీసుకువచ్చిన రిలయన్స్ జియో
- జియో భారత్ వీ2 పేరుతో సరసమైన ధరకే అందుబాటులోకి
- రెండు రంగుల్లో అందుబాటులో జియో భారత్
- యూపీఐ పేమెంట్స్ కోసం జియో పే యాప్
రిలయన్స్ జియో అత్యంత సరసమైన 4G ఫోన్ 'జియో భారత్ V2'ను సోమవారం విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.999 మాత్రమే. ఇందులో 4జీ నెట్ వర్క్, అపరిమిత ఫోన్ కాల్స్, యూపీఐ పేమెంట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. జులై 7 నుండి 10 లక్షల మందితో జియో భారత్ బీటా ట్రయల్స్ నిర్వహిస్తామని రిలయన్స్ జియో తెలిపింది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.... దేశంలో ఇప్పటికీ 25 కోట్లమంది 2జీ మొబైల్స్ వాడుతున్నారన్నారు. జియో నెట్ వర్క్‌ను తీసుకువచ్చినప్పుడే ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో భాగంగా జియో భారత్ ను తీసుకు వచ్చామన్నారు.
ఈ మొబైల్ కు నెలకు రూ.123 రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 0.5 జీబీ డేటాతో 28 రోజుల వ్యవధిలో 14 జీబీ డేటా వస్తుంది. ఇక సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది.
ఈ ఫోన్ ను కార్బన్ కంపెనీ తయారు చేసింది. రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. జియో సిమ్ లాక్ అయి ఉంటుంది. జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇందులో జియో పే యాప్ ను అందిస్తున్నారు. దీంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. టార్చ్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం జాక్, 0.3 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. డివైజ్ స్టోరేజ్ ని ఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది.