Raghunandan Rao: ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు... వైరల్ అవుతున్న వార్తల పట్ల రఘునందన్ రావు స్పందన

Raghunandan clarifies about media stories

  • అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినట్టుగా రఘునందన్ పై వార్తలు ప్రసారం
  • ఏదో ఒక పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్టుగా ప్రచారం
  • వాటిల్లో నిజంలేదంటూ ఖండించిన రఘునందన్ 

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ అధినాయకత్వానికి దాదాపు అల్టిమేటం ఇచ్చినట్టుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలు ఇవాళ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీకి నమ్మకంగా సేవలు చేశానని, ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందేనని, తేడా వస్తే జేపీ నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ అన్నారనేది ఆ వార్తల సారాంశం. 

అయితే, అంతటి తీవ్ర వ్యాఖ్యలు తాను చేయలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడా మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధికారం చేపట్టాలని బలంగా కోరుకునేవాళ్లలో తానూ ఒకడ్నని, దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశానని వెల్లడించారు. 

బీజేపీ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ తాను వ్యాఖ్యలు చేశాననడంలో నిజంలేదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు ఆ వార్తలను ఉపసంహరించుకోవాలని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీజేపీలో ఎప్పటికీ తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటానని, రఘునందన్ రావు, కమలం వేర్వేరు కాదని ఉద్ఘాటించారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, రఘునందన్ రావు ఢిల్లీ వెళ్లడం తెలిసిందే. రఘునందన్ రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి మాట్లాడారు. 

కాగా, బండి సంజయ్ కి కేంద్ర సహాయమంత్రి పదవి ఇస్తున్నారని, కిషన్ రెడ్డి ఇకపై తెలంగాణ బీజేపీ చీఫ్ గా వ్యవహరిస్తారని మీడియా చానళ్లలో ప్రసారమవుతోంది. దీంట్లో వాస్తవం ఎంత అనేది బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన వస్తే తప్ప చెప్పలేం.

  • Loading...

More Telugu News