Tomato: టమాటాలు కొని సూట్‌కేసులో భద్రపరిచి.. తుపాకితో రక్షణ.. కాంగ్రెస్ కార్యకర్తల వినూత్న నిరసన
- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘటన
- దేశవ్యాప్తంగా కొండెక్కిన ధరలు
- బీజేపీ నేతలకు అప్పుడు మంత్రగత్తెగా కనిపించిన ద్రవ్యోల్బణం ఇప్పుడు డార్లింగ్ అయిందని ఎద్దేవా
టమాటా ధరలు దేశవ్యాప్తంగా ఆకాశానికి ఎగబాకాయి. వాటిని కొనడం కాదు.. ఆ పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఏ కూరలోనైనా ఇట్టే కలిసిపోయే టమాటా ధరలు కొండెక్కడంతో కూరల నుంచి అవి దూరమయ్యాయి. ప్రస్తుతం వాటి ధరలు కొన్ని ప్రాంతాల్లో కిలో రూ. 160 వరకు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన టమాటా ధరలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు.
రాజధాని భోపాల్‌లోని 5 నంబరు మార్కెట్లో టమాటాలు కొని వాటిని సూట్‌కేసులో భద్రపరిచారు. ఆ తర్వాత దానికి భద్రతగా కొందరు తుపాకి (నకిలీ)తో భద్రత కల్పిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి విక్కీ ఖోంగల్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణాన్ని మంత్రగత్తెగా అభివర్ణించిన బీజేపీ నేతలకు ఇప్పుడది డార్లింగ్ అయిందని ఎద్దేవా చేశారు. అనంతరం తాము కొనుగోలు చేసిన కూరగాయలను పార్టీ కార్యాలయంలోని బీరువాలో భద్రపరిచారు.