KVP Ramachandra Rao: పురందేశ్వరిని చూసి జాలి పడుతున్నా.. చంద్రబాబు నిబద్ధత లేని నేత: కేవీపీ రామచంద్రరావు
- ఏపీలో బీజేపీ చేసిన పనులకు పురందేశ్వరి సమాధానం చెప్పాలన్న కేవీపీ
- రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు చంద్రబాబు నోరు కూడా మెదపలేదని విమర్శ
- రంగా అంటే వైఎస్ కు ప్రత్యేక అభిమానం ఉండేదని వ్యాఖ్య
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో పార్టీలో సమూల మార్పులకు బీజేపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చింది. ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణ చీఫ్ గా కిషన్ రెడ్డిని నియమించింది. మరోవైపు ఏపీ బాధ్యతలను పురందేశ్వరికి అప్పగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పురందేశ్వరిని చూసి జాలి పడుతున్నానని కేవీపీ తెలిపారు. ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు చేసిన పనులకు ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చాలా అన్యాయం చేసిందని విమర్శించారు. ఏపీలో బీజేపీకి ఉన్న 0.48 ఓటు శాతం కూడా పోతుందని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నిబద్ధత లేని నాయకుడని విమర్శించారు. రాహుల్ గాంధీతో వేదికను పంచుకుని, కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు... రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో కనీసం నోరు కూడా మెదపలేదని దుయ్యబట్టారు.
వంగవీటి రంగా అంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉండేదని కేవీపీ చెప్పారు. వైఎస్ అప్పగించిన బాధ్యతలను రంగా నెరవేర్చేవారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలమైన పునాదులు ఏర్పడటానికి రంగా ఎంతో కృషి చేశారని కొనియాడారు.