Nagaland: రెప్పపాటులో చిదిమేసింది.. కారుమీద పడిన బండరాయి.. వీడియో ఇదిగో!
- నాగాలాండ్ లో నేషనల్ హైవే 29 పై ఘోర ప్రమాదం
- ఇద్దరి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- వెనక ఉన్న కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డైన దారుణం
నాగాలాండ్ లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జోరు వర్షంలో హైవేపై దూసుకెళ్తున్న వాహనాలు కొండచరియలు విరిగిపడడంతో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ రాయి దొర్లుతూ వచ్చి కారు మీద పడింది. దీంతో కారు వెనుక భాగం మొత్తం నుజ్జునుజ్జుగా మారింది. లోపల కూర్చున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో కన్నుమూశాడు. మరొక ప్రయాణికుడు కారుకు, బండరాయికి మధ్య చిక్కుకుపోయాడు. ఇదంతా ఆ కారు వెనక ఆగిన మరో కారు డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాతీయ రహదారి 29 పై దిమాపూర్, కోహిమా సిటీల మధ్య పాకాల పహర్ అనే ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కొండను ఆనుకుని నిర్మించిన ఈ రోడ్డుపై తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదని చెప్పారు. బండరాయి మీద పడడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయని వివరించారు.
ఈ ప్రమాదంపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నిపూ రియో స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలంటూ అధికారులను ఆదేశించారు. పాకాల పహర్ ఏరియాలో వాహనదారుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘోరం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.