Telangana: గొంగళిపురుగుల దెబ్బకు స్కూలుకు సెలవు.. ఎక్కడంటే..!
- క్లాస్ రూంలో ఎక్కడ చూసినా పురుగులే..
- బడికి రావాలంటేనే భయపడుతున్న పిల్లలు
- ములుగు జిల్లా మర్రిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఘటన
ప్రభుత్వ పాఠశాలపై గొంగళిపురుగులు దండెత్తాయి. ఆవరణలోని చెట్లు, పుట్టలతో పాటు క్లాస్ రూం గోడలపైనా అవి నిండిపోయాయి. ఎక్కడ చూసినా పురుగులే కనిపిస్తుండడం, పై నుంచి మీద పడుతుండడంతో బడికి రావాలంటేనే పిల్లలు భయపడిపోతున్నారు. పురుగులు పెద్దసంఖ్యలో పాఠశాలలోకి ప్రవేశించడంతో టీచర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ పురుగుల బెడదను ఎలా వదిలించుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పాఠశాలకు హెచ్ఎం సెలవు ప్రకటించారు. తెలంగాణలోని ములుగు జిల్లా మర్రిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఈ సమస్య తలెత్తింది.
గొంగళిపురుగులు మీద పడడంతో ఒంటిపై దద్దుర్లు ఏర్పడి, మంటతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నామని వివరించారు. ఈ క్రమంలో స్కూలుకు రావాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. గొంగళిపురుల నివారణకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో లింక్