India: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదోసారి ట్రోఫీ గెలిచిన భారత్

India beat Kuwait in penalty shootout to win 9th SAFF Championship title

  • శాఫ్‌ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ లో విజేతగా టీమిండియా
  • ఫైనల్లో కువైట్ పై ఉత్కంఠ విజయం 
  • పెనాల్టీ షూటౌట్ లో సత్తా చాటిన గోల్ కీపర్ గుర్ ప్రీత్

సునీల్‌ ఛెత్రి కెప్టెన్సీలో భారత ఫుట్ బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్(శాఫ్‌) చాంపియన్‌షిప్‌ లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఏకంగా తొమ్మిదోసారి ట్రోఫీ గెలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. నిన్న రాత్రి బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో 5–4తో కువైట్‌ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం తర్వాత ఇరు జట్లూ 1–1తో సమంగా నిలిచాయి. కువైట్‌ జట్టు తరఫున 14వ నిమిషంలో షాబిద్‌ అల్‌ ఖల్దీ గోల్‌ చేయగా.. భారత ఆటగాడు లాలియన్జువాలా చాంగ్టే 38 నిమిషంలో గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు.

దాంతో, విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులోనూ పోరు హోరాహోరీగా సాగింది. ఐదు ప్రయత్నాల్లో భారత్, కువైట్ నాలుగు గోల్స్ చేయడంతో స్కోరు 4–4తో సమమైంది. దాంతో నిబంధనల ప్రకారం సడెన్‌ డెత్ నిర్వహించారు. ఇరు జట్లకు ఒక్కో పెనాల్టీ ఇచ్చారు. ఇందులో భారత ఆటగాడు మహేశ్‌ సింగ్‌ గోల్‌ కొట్టగా..  కువైట్ కెప్టెన్ ఖలెద్‌ షాట్‌ను భారత గోల్ కీపర్ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధూ అద్భుతంగా అడ్డుకొని జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత్ తన రికార్డును మరింత మెరుగు పరుచుకుంది.

  • Loading...

More Telugu News