Madhya Pradesh: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. భారీ మూల్యం చెల్లించుకున్న నిందితుడు
- గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన పర్వేశ్ శుక్లా ఇంటిని కూల్చేసిన మధ్యప్రదేశ్ అధికారులు
- ఇల్లు కూలిపోవడం చూసి హతాశులైన నిందితుడి కుటుంబసభ్యులు
- తమ కుమారుడిపై కుట్ర పన్నారని నిందితుడి తండ్రి వ్యాఖ్య
- ఎన్నికలు సమీపిస్తున్నందున పాత వీడియోను బయటకు లాగారని కుటుంబసభ్యుల ఆరోపణ
మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వ అదేశాలతో అధికారులు అతడి ఇంటిని బుల్డోజర్తో కూల్చేశారు. ప్రస్తుతం పర్వేశ్ శుక్లా రేవా సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతడిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మంగళవారం హెచ్చరించారు.
మరోవైపు, ఇల్లు కూలిపోవడం చూసి పర్వేశ్ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి నేరానికి సాక్ష్యంగా పోలీసులు ప్రస్తావిస్తున్న వీడియో చాలా పాతదని చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో రాజకీయ కారణాలతో దీన్ని బయటకు లాగారని ఆరోపించారు. అంతకుమునుపు, పర్వేశ్ శుక్లా తండ్రి కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘‘నా కుమారుడు ఇలాంటి పనిచేసేందుకు ఛాన్సే లేదు. అతడిపై ఏదో కుట్ర జరుగుతోంది. వీడియో చూసి మేము చాలా ఒత్తిడికి లోనయ్యాం’’ అని అన్నారు.