Australia: ఇంగ్లండ్ ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో.. తమ కుటుంబాలకు అదనపు భద్రత కోరిన ఆసీస్ ఆటగాళ్లు!
- రెండో టెస్ట్‌లో ఆసీస్ ఆటగాళ్లకు చేదు అనుభవాలు
- వివాదాస్పదమైన బెయిర్ స్టో ఔట్
- లీడ్స్ మైదానంలో అదనపు భద్రత కోసం విజ్ఞప్తి
ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు సందర్భంగా లార్డ్స్ లాంగ్ రూంలో చోటు చేసుకున్న సంఘటనలు, ప్రేక్షకులు ప్రవర్తించిన తీరు నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులకు మరింత భద్రత కల్పించాలని ఆసీస్ ప్లేయర్లు కోరినట్లుగా తెలుస్తోంది. రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదమైంది. అలాగే ఆసీస్ ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల పట్ల ఇంగ్లండ్ అభిమానులు దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు మూడో టెస్ట్ జరిగే లీడ్స్.. బెయిర్‌స్టో సొంత మైదానం కావడంతో అదనపు భద్రతను కోరినట్లు వార్తలు వచ్చాయి.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదనపు భద్రత కావాలని అడిగారని, లార్డ్స్ లో ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ జట్టు సహాయక సిబ్బంది తనయుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, మరో ఆటగాడి తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయని యాషెస్ వర్గాలు తెలిపాయి. కాగా, ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఆసీస్ 2-0తో ముందంజలో ఉంది.