Indian Railways: కొన్ని రూట్లలో తగ్గనున్న వందే భారత్ ట్రైన్ టికెట్ ధరలు
- ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న రూట్లపై తగ్గింపు
- వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ పెంచేందుకు నిర్ణయం
- ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు
భారతీయ రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టికెట్ ధర కాస్త ఎక్కువైనా వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండడంతో వందే భారత్ లో ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వివిధ రాష్ట్రాలలో ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకు వచ్చిన 46 వందే భారత్ రైళ్లలో కొన్నింటిని మాత్రం ప్రయాణికులు ఆదరించడంలేదని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొన్ని రూట్లలో వందకు వంద శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. మరికొన్ని రూట్లలో మాత్రం ఆక్యుపెన్సీ అతి తక్కువగా నమోదవుతోందని చెప్పారు.
ముఖ్యంగా భోపాల్ - జబల్ పూర్ మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలుకు ప్రయాణికులే కరవయ్యారట. ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ కేవలం 29 శాతం మాత్రమేనని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఇండోర్- భోపాల్ (21 శాతం ఆక్యుపెన్సీ), నాగ్ పూర్ - బిలాస్ పూర్ (55 శాతం ఆక్యుపెన్సీ) రూట్లలో ప్రయాణించే వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం వందే భారత్ టికెట్ ధరలేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రూట్లలో టికెట్ ధరలను తగ్గించడం ద్వారా వందే భారత్ ట్రైన్లకు ఆదరణ పెంచాలని, పూర్తి ఆక్యుపెన్సీతో ఈ రైళ్లను నడపాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.