Tirumala: ఆక్టోపస్ పహారాలో తిరుమల
- శ్రీవారి ఆలయానికి భద్రత పెంచనున్న ప్రభుత్వం
- త్వరలో ఆక్టోపస్ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు
- ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది
శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల తిరుమలలో భద్రతా ఏర్పాట్లను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ టీం సూచనలతో శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద ఆక్టోపస్ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆలయంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్టోపస్ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తయారు చేసిన టీం ఆక్టోపస్.. ఉగ్రదాడులకు సంబంధించిన ఆపరేషన్లలో ఆక్టోపస్ బృందాలు ఆరితేరి ఉంటాయి. టెర్రర్ దాడులకు సంబంధించి ఈ బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, డే-విజన్ కళ్లద్దాలు, అత్యాధునిక ఆయుధాలతో నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఎలాంటిదాడినైనా మెరుపువేగంతో తిప్పికొట్టడంలో ఆక్టోపస్ టీం సభ్యులు నిష్ణాతులు. అధునాత ఆయుధాలను అలవోకగా వాడగల సత్తా ఆక్టోపస్ టీమ్‌కు ఉంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆక్టోపస్ బృందాలు సెక్యూరిటీ కల్పిస్తున్నాయి.