Karumuri Nageshwar Rao: ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా.. సింగిల్‌గానే ఎదుర్కొంటాం: మంత్రి కారుమూరి
- అన్ని ఎన్నికల్లోనూ ఒంటిరిగానే పోటీ చేసి గెలిచామన్న కారుమూరి
- షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని వెల్లడి
- గతంలో కంటే ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింగిల్‌గానే ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. ఎన్నికలు ముందు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని అన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో.. మాట్లాడుతూ తాము షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. బీజేపీ ఎవరిని అధ్యక్షురాలిగా పెట్టుకున్నా తమకు సంబంధం లేదని అన్నారు. మూడు పార్టీలు కలిసినా, బీఆర్ఎస్ కూడా వారితో కలిసినా తాము ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అని కారుమూరి చెప్పుకొచ్చారు.
గత చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిందని ఆరోపించారు. 20 వేల కోట్ల అప్పులు చేసి.. పసుపు, కుంకుమకు మళ్లించారని మండిపడ్డారు. ఆ అప్పులన్నీ తాము తీర్చి శాఖను మళ్లీ గాడిలో పెట్టామని చెప్పారు. కోటి 46 లక్షల మందికి తాము రేషన్ ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామని తెలిపారు.