Bihar: బీహార్ లో పిడుగుల వాన... ఒక్కరోజులో 32 మంది మృత్యువాత
- బీహార్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- 14 జిల్లాల్లో పిడుగుపాటు
- రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం నితీశ్ కుమార్
- బీహార్ లో మరో 4 రోజులు వర్షాలు పడతాయన్న ఐఎండీ
బీహార్ లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్ల పిడుగులు పడడంతో ఒక్క మంగళవారం రోజే 32 మంది మృత్యువాత పడ్డారు. 14 జిల్లాల పరిధిలో పిడుగుపాటు మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
బీహార్ లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇవాళ ఈశాన్య, నైరుతి బీహార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.