Bandi Sanjay: దయచేసి మా ఇద్దరిపై ఆ ప్రచారాన్ని ఆపేయండి: బండి సంజయ్

Bandi Sanjay praises Kishan Reddy

  • కిషన్ రెడ్డికి తామంతా శిష్యులవంటివాళ్లం అని వెల్లడి
  • తనను రారా... పోరా అనేది ఆయనొక్కరేనని వెల్లడి
  • అందరం కలిసి ముందుకు సాగుతామని చెప్పిన బండి సంజయ్
  • 8న మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

సోషల్ మీడియాలో తనకు, కిషన్‌రెడ్డికి, తమ పార్టీలోని ఇతర నాయకులకు వ్యతిరేకంగా చేస్తోన్న ప్రచారాన్ని దయచేసి ఆపివేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సందట్లో సడేమియాలా కొంతమంది ఇతర పార్టీల నాయకులు వీటి ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు... పోయేది లేదని, వాటిని తామెవరం పట్టించుకోమన్నారు. ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిది కాదన్నారు. మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు సరికాదు.. ఇక్కడ అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రామరాజ్య పాలన తెచ్చే విధంగా పని చేద్దామన్నారు. 

రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పెద్దలు, మా అందరి నాయకుడు కిషన్ రెడ్డి గతంలో పని చేసిన విధానాన్ని మనమంతా చూశామని, కిందిస్థాయి నుండి ఢిల్లీ వరకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే తెలంగాణ ఆవిర్భవించాక ఇక్కడా పార్టీని శక్తిమంతంగా తయారు చేశారన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడానికి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు.

వాస్తవానికి కిషన్ రెడ్డికి తామంతా శిష్యులలాంటి వారమన్నారు. మొదటి నుండి తనను రారా... పోరా అని కొట్టేది ఆయన ఒక్కరే అన్నారు. యువమోర్చాలో ఉన్నప్పుడు, విద్యార్థి పరిషత్ లో గొడవలు జరిగినప్పుడు ఏదైనా ఉంటే తాను ఆయనకే ఫోన్ చేసేవాడినన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనపై అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు.

ఈ దేశంలో కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రధాని మోదీ చెబుతున్నారన్నారు. ఈ నెల 8న వరంగల్ లో జరగనున్న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News