BRS: మహిళా వీసీపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్!
- బాలికలకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందిస్తున్నానని వీసీ వద్దకు బీఆర్ఎస్ నాయకుడు
- మహిళా వర్సిటీ అభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలన్న వీసీ
- వీసీని దూషించిన నాయకుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వీసీ
కోఠి మహిళా విశ్వవిద్యాలయం వీసీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పోలీసులు ఓ బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాను సామాజిక కార్యకర్తనంటూ... బాలికలకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందిస్తున్నానని గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే బీఆర్ఎస్ నాయకుడు ఈ నెల 1వ తేదీన వీసిని కలిసి చెప్పాడు. అంతేకాదు, తనకు సన్మానం చేయాల్సిందేనని వీసీకి చెప్పాడు. అయితే మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని వీసీ.. అతనికి విజ్ఞప్తి చేశారు.
తాను గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వేమైనా ఐపీఎస్, ఐఏఎస్ అధికారిని అనుకుంటున్నావా? వీసీవి అయ్యాక కళ్లు నెత్తికెక్కాయి.. అని దూషించాడు. దీంతో శ్రీనివాస్ పై వీసీ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.