Karnataka: ఉచిత బస్సు ప్రయాణం కోసం బురఖా ధరించిన హిందూ వ్యక్తి!
- బస్టాప్‌లో బురఖా ధరించి కూర్చున్న హిందూ వ్యక్తి వీరభద్రయ్య
- అతడి వద్ద మహిళ ఫొటో ఉన్న ఆధార్ లభ్యం
- ఉచిత బస్సు ప్రయాణం కోసం బురఖా ధరించాడని స్థానికుల అనుమానం
- భిక్షాటన కోసం వేసుకున్నానన్న వీరభద్రయ్య
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో రోజుకో వైరల్ ఉదంతం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో ఉచిత ప్రయాణం కోసం బురఖా ధరించాడన్న వార్త వైరల్‌గా మారింది. బస్టాప్‌లో బురఖా ధరించి కూర్చున్న వీరభద్రయ్య మఠాపతిని చూసిన కొందరికి అనుమానం కలిగింది. వారు అతడిని ప్రశ్నించగా తాను భిక్షాటన కోసం బుర్ఖా ధరించినట్టు చెప్పుకొచ్చాడు. అతడి వద్ద మహిళ ఫొటో ఉన్న ఆధార్ కార్డు కూడా లభించడంతో సందేహాలు మరింత బలపడ్డాయి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జూన్ 11న కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం శక్తి యోజన పేరిట ఈ ఉచిత బస్సు సర్వీసు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన అయిదు ముఖ్య వాగ్దానాల్లో ఇదీ ఒకటి. అయితే, తమ పథకం ప్రజాదరణ పొందుతుండటంతో ఓర్వలేని వారు సోషల్ మీడియాలో వీడియోలు, వార్తలను వైరల్ చేస్తూ పథకం విఫలమైందని చెప్పేందుకు ప్రయాసపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.