JC Prabhakar Reddy: నేనే వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
- రైతులకు రావాల్సిన పరిహారాన్ని పెద్దారెడ్డి స్వాహా చేస్తున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
- మొక్కలు నాటిన ఏడాదికే పంట నష్టపరిహారం ఎలా అందిందని ప్రశ్న
- పెద్దారెడ్డి చీనా తోటకు తానే వస్తున్నానంటూ సవాల్
- చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడి
- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లండన్‌లో క్లబ్బుల్లో గ్లాసులు కడిగేవారంటూ సెటైర్లు
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు రావాల్సిన పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా విషయంలో రైతులకు న్యాయం జరగలేదని, వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని ఆరోపించారు.
ఈ రోజు తాడిపత్రిలో మీడియాతో జేసీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని, దీనిపై వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ‘‘పెద్దారెడ్డి చీనా తోటకు వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. చీనా తోటలో పంట లేకుండానే.. పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
‘‘మొక్కలు నాటిన ఏడాదికే పెద్దారెడ్డికి పరిహారం అందింది. ఎమ్మెల్యేకు భయపడి అధికారులు పరిహారం ఇస్తున్నారు. నేను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నా” అని చెప్పారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాడిపత్రికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని.. కారుకూతలు కూస్తున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీ ధర్మవరం వస్తా.. ఇంటి దగ్గరకు వస్తా.. ఏం చేస్తావ్’’ అంటూ సవాల్ విసిరారు. వెంకట్రామిరెడ్డి లండన్‌లో క్లబ్బుల్లో గ్లాసులు కడిగేవారని విమర్శించారు.
వెంకట్రామిరెడ్డి ‘గుడ్ మార్నింగ్’ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. తిండి నుండి దుస్తుల వరకు అన్నీ దోపిడీ చేసినవేనన్నారు. ధర్మవరంలో నేసేవాళ్లు ఎంత బాధపడుతున్నారో ఎవర్ని అడిగినా తెలుస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు.