Harish Rao: మాది న్యూట్రిషన్ రాజకీయం... విపక్షాలది పార్టిషన్ రాజకీయం: హరీశ్ రావు
- 1500 మంది ఆశా వర్కర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించిన మంత్రి
- నాడు ఆశా వర్కర్లు వేతనం పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారని విమర్శ
- దేశంలోనే అత్యధిక వేతనం తెలంగాణలోనే ఉందని వెల్లడి
బీఆర్ఎస్ ప్రభుత్వం న్యూట్రిషన్ రాజకీయాలు చేస్తే, విపక్షాలు పార్టిషన్ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా రిక్రూట్ అయిన 1500 మందికి పైగా ఆశావర్కర్లకు శిల్పకళా వేదికపై మంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... వేతనం పెంచాలని కోరిన ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర గత ప్రభుత్వాలది అన్నారు. దేశంలోనే ఆశా వర్కర్లకు అత్యధిక వేతనం తెలంగాణలోనే ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నరంలేని నాలుక అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ ఆశా వర్కర్లకు వేతనాలు అంతంతమాత్రమే అన్నారు.
ఈ నెల నుండి ఆశాలకు ఫోన్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది దేవతల్లా కనిపిస్తారని, ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. దీనిని నిలబెట్టుకోవాలని సూచించారు.
ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్లేవారమని, తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని, దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందన్నారు.
గ్రేటర్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్‌తో మాతా శిశు మరణాలను తగ్గించామన్నారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.