TDS Refund Scam: టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై ఐటీ శాఖ ఏం చెప్పిందంటే...!

IT Dept press meet on TDS Refund scam

  • టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై హైదరాబాదులో ఐటీ శాఖ మీడియా సమావేశం
  • వివరాలు తెలిపిన ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మధుస్మిత
  • టీడీఎస్ కుంభకోణంపై విచారణ కొనసాగుతోందని వెల్లడి
  • తప్పుడు వివరాలతో ఎందరు రిఫండ్ తీసుకున్నారో ఇప్పుడే చెప్పలేమని వివరణ

టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై ఆదాయ పన్ను శాఖ హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించింది. ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మధుస్మిత మీడియాతో మాట్లాడారు. టీడీఎస్ కుంభకోణంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. తప్పుడు వివరాలతో ఎందరు రిఫండ్ తీసుకున్నారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. 

ఆధారాలు అప్ లోడ్ చేయకుండానే రిఫండ్ తీసుకున్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు రిఫండ్ తీసుకున్నారని తెలిపారు. టీడీఎస్ మొత్తంలో 75.90 శాతం ఐటీ రిటర్న్ లు క్లెయిమ్ చేశారని చీఫ్ కమిషనర్ వెల్లడించారు. బెంగళూరు సెంటర్ ద్వారా అనుమానితులను విచారించామని పేర్కొన్నారు. 

గత రెండు, మూడేళ్ల ఐటీ రిటర్న్ లను పరిశీలిస్తామని చెప్పారు. 2021-22లో 37 శాతం ఉన్న రిఫండ్ 2022-23లో 84 శాతానికి చేరిందని వివరించారు. ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్ లను సవరించుకునేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. తొమ్మిది మంది ఐటీ ప్రాక్టీషనర్ల రిటర్న్ లను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. 

టీడీఎస్ రిఫండ్ కోసం హైదరాబాద్ నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పెద్ద ఎత్తున ట్యాక్స్ రిఫండ్, మినహాయింపులు కోరుతూ ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని... ఏపీ, తెలంగాణలో ఎక్కువమంది మినహాయింపులు కోరారని వివరించారు. 

అర్హత లేని క్లెయిమ్  ద్వారా పన్ను రిఫండ్, మినహాయింపులు పొందారని ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ వెల్లడించారు. తప్పుడు క్లెయిమ్ లతో రిటర్న్స్ దాఖలు చేస్తున్న విషయం గత మూడేళ్లుగా సాగుతున్నట్టు గుర్తించామని తెలిపారు. కాగా, సవరించిన ఐటీ రిటర్న్ లు దాఖలు చేసేందుకు డిసెంబరు వరకు సమయం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News