PC Swamy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రిటైర్డ్ ఎస్పీజీ అధికారి పీసీ స్వామి
- గతంలో ఎస్పీజీ కమాండెంట్ గా పనిచేసిన పీసీ స్వామి
- ఎనిమిది మంది ప్రధానుల రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకున్న వైనం
- 33 ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేసిన స్వామి
- స్వామికి పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి పీసీ స్వామి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
పీసీ స్వామి గతంలో ఎస్పీజీ కమాండెంట్ గా పనిచేశారు. ఎస్పీజీ విభాగంలో కమాండెంట్ గా స్వామి ఎనిమిది మంది ప్రధానమంత్రుల రక్షణ బాధ్యతల్లో పాలు పంచుకున్నారు. 33 ఏళ్ల సర్వీస్ తరువాత స్వామి పదవీ విరమణ చేశారు.
చంద్రబాబు నాయుడు విజన్ ను, ఆయన పాలనను అభిమానించే పీసీ స్వామి... నేడు టీడీపీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీకి సేవలందిస్తానని తెలియజేశారు. పీసీ స్వామితో పాటు రిటైర్డ్ రోడ్లు భవనాలు ఇంజనీర్ జీవి కృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ చేరిక సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్. బి. సుధాకర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బుల్లెట్ రమణ, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి, వెదురు కుప్పం మండలం ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పి. సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.