Vidhan Soudha: ఎమ్మెల్యేలా కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడి.. దర్జాగా కుర్చీలో కూర్చున్న 72 ఏళ్ల వృద్ధుడు
- ఎంట్రీ పాస్ సంపాదించి ఎమ్మెల్యేగా చెప్పుకుని లోపలికి ప్రవేశం
- నిందితుడిని చిత్రదుర్గకు చెందిన తిప్పేరుద్రగా గుర్తింపు
- 15 నిమిషాలపాటు ఎవరూ గుర్తించని వైనం
- జేడీఎస్ ఎమ్మెల్యే గుర్తించి మార్షల్స్‌కు సమాచారం
కర్ణాటక అసెంబ్లీలో భద్రతా వైఫల్యం బయటపడింది. 72 ఏళ్ల వృద్ధుడొకరు ఎమ్మెల్యేలా పోజిస్తూ దర్జాగా అసెంబ్లీలోకి వెళ్లి కూర్చున్నాడు. 15 నిమిషాలపాటు అతడిని ఎవరూ గుర్తించలేకపోయారు. చివరికి ఓ ఎమ్మెల్యే గుర్తించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని చిత్రదుర్గకు చెందిన తిప్పేరుద్రగా గుర్తించారు. సాగర్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణగా నటిస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తొలుత అసెంబ్లీ హాళ్లలో తిరిగిన నిందితుడు ఆ తర్వాత అసెంబ్లీలోని దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ సీటులో కూర్చున్నాడు. అతడిని చూసి అనుమానించిన జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ మార్షల్స్‌కు, స్పీకర్‌కు సమాచారం అందించారు.
మార్షల్స్ వచ్చి ఆయనను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తాను ఎమ్మెల్యేనని, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని మొండిపట్టు పట్టాడు. అయితే, ఎమ్మెల్యే అని రుజువు చేసే ఎలాంటి ఆధారాలు ఆయన వద్ద లేకపోవడంతో ఆయనను అరెస్ట్ చేశారు. విజిటర్స్ పాస్‌తో లోపలికి ప్రవేశించిన వృద్ధుడు తాను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేనని చెప్పడంతో మార్షల్స్ కూడా నిజమేననుకుని లోపలికి విడిచిపెట్టారు. రుద్రప్పపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.