Pedda Reddy: ఎమ్మెల్యే పదవి లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డిని చెప్పుతో కొట్టుకుంటూ తాడిపత్రి మొత్తం తిప్పుతా: పెద్దారెడ్డి
- జేసీ, పెద్దారెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లతో అట్టుడుకుతున్న తాడిపత్రి
- జేసీ అంత వెధవను రాష్ట్రంలో ఎవరినీ చూడలేదన్న పెద్దారెడ్డి
- మగాడు ఎవడైనా ఉంటే జేసీతో పాటు తన తోటలో అడుగు పెట్టాలని సవాల్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చీనీ తోటలకు పంట బీమా డబ్బులను పెద్దారెడ్డి కొట్టేశారంటూ జేసీ నిన్న ఆరోపించారు. పెద్దారెడ్డి చీనీ తోటలను పరిశీలించేందుకు ఈరోజు వెళ్తానంటూ నిన్న ఆయన సవాల్ విసిరారు. దీంతో జేసీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
మరోవైపు జేసీకి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. జేసీకి వ్యవసాయం అంటే ఏమిటో తెలియదని పెద్దారెడ్డి అన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట బీమా అందరు రైతులకు వచ్చినట్టే తనకు కూడా వచ్చిందని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వెధవను ఈ రాష్ట్రంలో ఎవరినీ చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో మగాడు అనేవాడు ఎవడైనా ఉంటే ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు.
ఈ ఎమ్మెల్యే పదవి తనకు ముఖ్యమంత్రి జగన్ పెట్టిన భిక్ష అని పెద్దారెడ్డి అన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి లేకుంటే జేసీని ఇంటి నుంచి లాక్కొచ్చి చెప్పుతో కొట్టుకుంటూ తాడిపత్రి మొత్తం తిప్పుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.